Abby and Brittany: అవిభక్త కవలల్లో ఒకరి వివాహం.. పెళ్లిలో వధూవరుల డ్యాన్స్ వీడియో ఇదిగో!

  • అమెరికా ప్రజలకు సుపరిచితమైన అవిభక్త కవలలు ఆబీ, బ్రిటానీ
  • రెండు తలలు ఉన్న వ్యక్తిగా కనిపించే కవలలు
  • శరీరంలోని కుడి భాగాన్ని ఆబీ, ఎడమ భాగాన్ని బ్రిటానీ నియంత్రిస్తున్న వైనం
  • 2021లో ఆబీ వివాహం, తాజాగా నెట్టింట వీడియో వైరల్
Conjoined twin Abby Hensel is married to US Army veteran

అమెరికా ప్రజలకు సుపరిచితమైన అవిభక్త కవలల్లో ఒకరైన అబీ హాన్సెల్.. జాష్ బౌలింగ్‌ అనే ఆర్మీ అధికారిని పెళ్లాడారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ వివాహం గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. భర్తతో కలిసి అబీ హాన్సెల్ దిగిన ఫొటోలు, వారు కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. పెళ్లి సందర్భంగా ఈ ఫొటోలు తీసినట్టు తెలుస్తోంది. 

ప్రముఖ ‘ది ఓఫ్రా విన్ఫ్రే షో’ ద్వారా తొలిసారిగా అబీ, హాన్సెల్‌‌ల గురించి ప్రపంచానికి తెలిసింది. 1996లో ఈ షో ప్రసారమైంది. ఒకే వ్యక్తికి రెండు తలలు ఉన్నట్టుగా కనిపించే వీరికి ఆ షోతో అమిత గుర్తింపు వచ్చింది. శాస్త్ర పరిభాషలో అబీ, బ్రిట్టానీలను డైసెఫాలస్ కంజాయిన్డ్ ట్విన్స్ అని పిలుస్తారు. అంటే.. తలలు మాత్రమే వేర్వేరుగా, మిగతా శరీరం మొత్తం కలిసి ఉన్న కవలలని అర్థం. 

ఛాతి వరకూ వీరి అంతర్గత అవయవాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఉదర భాగం దిగువన మాత్రం ఇద్దరికీ కలిపి అవయవాలు ఒకటనేనని వైద్యులు తెలిపారు. ఇక, తమ శరీరంలోని కుడి భాగం అబీ నియంత్రణలో ఉంటే ఎడమ భాగాన్ని బ్రిటనీ నియంత్రిస్తుంది. అబీ అండ్ బ్రిటానీ పేరిట ఓ రియాలిటీ షో కూడా కొంతకాలం ప్రసారమైంది. 

1990లో యాబీ, బ్రిటానీలు జన్మించారు. పుట్టినప్పుడే వారిని శస్త్రచికిత్సతో విడదీసే అవకాశం ఉన్నప్పటికీ ఈ ఆపరేషన్‌లో రిస్క్ ఎక్కువగా ఉండటంతో తల్లిదండ్రులు వెనకడుగు వేశారు. వారు ఎక్కువ కాలం బతకరని వైద్యులు చెప్పినా ఆబీ, బ్రిటానీలు పెద్దయ్యారు. ఆబీ ఏకంగా వివాహం కూడా చేసుకుంది. డైసెఫాలస్ అవిభక్త కవలలు సాధారణంగా పుట్టిన కొన్ని రోజులకే చనిపోతారని వైద్యులు చెబుతున్నారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే వీరు పెరిగి పెద్దవుతారు. ఇలాంటి అవిభక్త కవలలకు చేతులు రెండు నుంచి నాలుగు వరకూ ఉండొచ్చు. ఈ లింక్ ద్వారా వీడియోను చూడొచ్చు.

More Telugu News